Sunday, October 24, 2010

యద భారమైనా సరే

దహించు ఈ వేదనే సహించలేకున్నా
తప్పని ఈ నిజాన్ని తప్పించుకోలేకున్నా
నువు రావని తెలిశాక ఆమని ఇక దరిచేరేనా
నువు లేవని తెలిశాక నాకని ఇక నేనుంటానా
కలలెన్నో కలవని కలవరించే కనులకు కన్నీరే మిగిలింది
నిజమేదో తలవని తపించే తలపులకు గతమే మిగిలింది
నువు దూరమయ్యవని నా ప్రేమ నన్ను దూరమవ్వదు
యద భారమైనా సరే కథ ముందుకు నడిపిస్తాను

Wednesday, October 6, 2010

నీ కోసమే కలం పట్టాను

నీ కోసమే కలం పట్టాను 
నీ కోసమే కలలు కన్నాను

కాదని కాలదన్నితే 
కాటికి సాగనంపితే
జీవచ్చవమై బ్రతుకుతున్నాను 
యదను పరచి స్వాగతిస్తే ....
నీవు వ్యధను పెంచి ఉసురు తీస్తే 
శ్వాస బరువై భరిస్తున్నాను 
మాటకు బదులు రాదు
పాటకు కదిలి రావు
తూట్లు పడిన నా గుండెకు ఇక కదలికే రాదు 
కన్నీటి కలలకెదురుగా ఎన్నాళ్ళీ ఎదురీత 
పదునెక్కిన మౌన శిలల మధ్య ఎన్నాళ్ళీ యదకోత 

నేను కవిని కావాలని

నేను కవిని కావాలని 
నా మనసు ఉరకలు వేస్తోంది 

అందుకే నిద్రిస్తున్న నా చెలియను 
అనిమేషంగా పరిశీలిస్తూ ఎదురుగా కూర్చున్నాను 

అప్పుడే వరప్రసాదంలా కలువరేకుల్లా 
తన కళ్ళు విచ్చుకుంటుంటే నాలోని కవితా భావం 
చంద్ర కిరణంలా వెల్లివిరిసింది 

ఆమె ఉచ్చ్వాస , నిశ్వాసల శబ్ద ,నిశ్సబ్డ్హాలు 
నా హృదయ కవాటాల్లా ఝుమ్మంటున్నాయి

ధైర్యం తోడుగా నిలిచింది 
ప్రేమ ప్రేరణగా  నడిపింది 

తియ్యని కవితా ప్రవాహంలా నా కవి హృదయాన్ని వెలికి తీశాను 
వెంటనే నా కలం తన కలల వెంట పరుగులు తీసింది 
ఆ వెంటనే వెండి వెన్నెల కుంచెతో సంధ్యారాగాలు 
చిత్రించినట్లు ఆమె చిరునవ్వు విరిసింది 

అ నవ్వుల వెన్నెల్లో తడిసి ముత్యాల్లా 
మెరుస్తున్నాయి నా కవితాక్షరాలు 

తన అందియల చిరు చిరు సవ్వడులు 
నా కవితా గానానికి తాళం అయ్యాయి 

ఐతే ఏం లాభం నా గీతం తన చెవిని 
చేరేలోగా నా గానం మూగవోయింది

నగవు

మగువల నగవులకే నీవు నగవు
కవుల కలములకే నీవు కలవు
నినుగన్న సెలయేటి ఉరుకులకిక సెలవు
నీ సిగ చేరి పులకించె సిరిమల్లె తనువు
నా కన్నుల కదలాడు కన్నెవు
హరివిల్లు చూపలేని విరిజల్లు వన్నెవు
సిరివెన్నెల కాయించు కలువవు
కనుగలువల పూయించు కొలనువు

Monday, October 4, 2010

నీ చూపు కిరణాలు

నీ చూపు కిరణాలు సోకి 
నింగి సరసున విరిసె సూర్యకమలం 
నీ వైపు చరణాలు సాగి 
కైతలెన్నో వ్రాసె నా కలం 
నీ మోము చందాలు చూసి 
మబ్బు చాటు దాగె చంద్ర వదనం 
నీ ప్రేమ భారాన్ని మోసి 
ఆణువణువూ పులకించే నా హృదయ సదనం 

నీ చరణ మంజీర రావాన పలికే కల్యాణి రాగం 
నా కవనామృతధార భావాన ఒలికే త్రివేణీ వేగం

మాటకందని అందం

మాటకందని అందం ఆమెకేలే సొంతం 
ఆ బ్రహ్మదేవుడు ఓ చల్లని సాయంత్రం 
పువ్వులన్నీ తీసుకొచ్చి రాశిగా పోసే అమాంతం 
అది ఆనాటి జక్కన కళకు తార్కాన శిల్పం 
మరి ఈనాడు ప్రాణమొచ్చిన వనితా వసంతం 
ఆమె నవ్వు పసిడి కాంతుల పచ్చల పతకం 
ప్రతి పువ్వూ అయిపోదా తన పాదాక్రాంతం 
ఆమె చిరు పలుకులు సంగీతానికి ఆద్యంతం 
అవని మీది పడుచుల్లో ఆమేలె కన్యాకాంతం 
తన చూపు ప్రసరిస్తే బానిసవనా జీవితాంతం

కవిత

కవిత నా భవిత 
పాట నా బాట 
ఈ కవితకు రూపం నా యెద నిండిన వనిత 
నా పాటకు భావం ఆమె కనుచూపుల సయ్యాట 

తన మాటల మూట నా కవితల పూదోట 
ఆమె నవ్వుల పూలు నా పాటల ప్రాసకు ఓనమాలు 

పల్లవిలోంచి చరణంలోకి హాయిగా జారినట్లు 
తన వయ్యారాలకు తాళం వేసే వాలుజడ నా పాటల పూగెడ 

తన పెదవుల దాగిన సుధ నా పాటకు పంచెను పదసంపద 
తన అందెల సవ్వడి,నా యెదలో అలజడి నా పాటకు తెచ్చెను సందడి 
తన నడుమున సోయగం నా పదాలకల్లెను కొత్త రాగం

ఓం సాయి శ్రీ సాయి

ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి 
నీ నామ స్మరణమే మాకెంతో హాయి 

జయ సాయి మా సాయి శ్రీ దత్త సాయి 
నీ పుణ్య ధామమే మాకు ద్వారకామాయి 

కరుణించి కాపాడు దేవుడివే 
మరణించీ పలుకుతున్న పరమాత్మవే 
నీ దివ్య రూపము చూడగనే 
మా పాపాలు మంటల్లో కరిగేనే 
దండాలే పెడతాము పాదాలకి 
అండగా నువ్వుండాలి లోకాలకి 


పూలెన్నో తెచ్చాము నీ పూజకి 
దయచూచి కష్టాలు కదతేర్చవా 
ప్రతినిముషం మా నోట నీ నామమే 
నీ మీద వేశాము మా భారమే 
వెన్నంటి నువ్వుంది నడిపించగా 
ప్రతిరోజూ మాకింక ఓ పండగ

అడుగులు

అడుగులు తడబడుతున్నాయి 
మాటలు కరువవుతున్నాయి 
గుండె నుంచి గొంతు దాకా నీ ఊసుల బరువే 
బరువు దించుదామంటే పరువు పోతుంది 
భరిద్దామంటే ఊపిరి పోతుంది 
నిన్ను చేరువయ్యేదాకా కన్నీటి చెరువు కట్టలు తెగుతూనే ఉంటుంది 
నా నరాలతో స్వరాలు మీటి 
పెదాలతో పదాలు కూర్చి 
వేదననే వేదిక చేసి నీకై గీతం 
ఆలపించి ,ఆలసించి,నీరసించి పోయాను

వేమనకందని వేదన

వేమనకందని వేదన పద్యం 
నా ఎదనిండిన ఈ అశ్రు మద్యం 
ఆ మత్తులోనే గమ్మత్తుగానే 
నా ఆశ విడిచి నా శ్వాస మరిచి 
ప్రేమలోక వీధుల్లో తూలుతూ తిరిగాను 
ప్రేమలేక నేనిలా ఒంటరిగా మిగిలాను

చిరునవ్వుతోనే

చిరునవ్వుతోనే చిత్రహింస పెడతావు 
విరజాజి పువ్వులా మత్తులో దించుతావు 
ఎన్నని చెప్పను ఉపమానాలు 
ఎక్కడని వెతకను నా చిరునామాను 
కంటిచూపుతోనే చెరకు వింటి శరము సంధిస్తావు 
వెంట పడినా అందకుండా ఎందుకిలా వేధిస్తావు 
ఏదని చెప్పను నీ సాటి అందం 
ఎంతని చెప్పను నా మనసున ఆనందం 
నీ కులుకుతోనే కునుకు పట్టనీవు 
కునుకు పడితే కలలోన కళ్ళు తెరవనీవు 
ఏమని చెప్పను నా మనసున ఈ భావం 
ఆ భావాల కవితకు నీవేగా జీవం

వేదమంటి నా హౄదయవేదన

వేదమంటి నా హౄదయవేదన వింటావా
పాదమంటు కన్నీటి రోదన కంటావా

కంటి నిండా నీటితో, వంటి నిండా విషముతొ
క్షణము క్షణము నా కణము కణము కౄశించిపోతున్నది.

గుండె నిండా నీవుతో, బండబారిన నేనుతో
వ్రణము ఘనమై, నా కణము కణము శిలలౌతున్నది

కంటి ముంగిట కలలతో, ఇంటి ముంగిట కళలతో
క్షణము క్షణము, నా కణము కణము నీకై ఎదురు చూస్తున్నది

చెరకు వింటి పూలవానలా, చంటి పాప పాలవాసనలా
తనువు మనసై, నా కణము కణము నీ ప్రేమ నిండినది.

మందార మకరంద

మందార మకరంద మందహాసములోన
మంజీర నాదమ్ము మంద్రముగ వినిపించె
నీలాల నీ లోచనములందు నీలోత్పలము అందముగ వికసించె
సరిలేని స్వరములోన సరిగమలు సరసముగ సవరించె
మౄదు మధుర అధర పల్కులు యదలెన్నో వీణతంత్రముగ కదిలించె
కుదురు లేని కురులు కులుకుతుంటె సరిగంగ అలలుగ ఉప్పొంగె

నేను ఏ వారధి కట్టాలి

నేను  వారధి కట్టాలి కన్నీటి కడలిని దాట? 
నేనే సారధినైతి యదలో దిగు కంటకమ్ముల బాట 

చిల్లు పడిన హృదయ కవాటమందు వినబడలేదా 
వెల్లువెత్తిన రుధిర ప్రవాహ మురళీ గానం 

కళ్ళు విడిచిన అశ్రు శ్వాసయందు కనబడలేదా 
నీకై వేచి చూచే నా ప్రాణం 

పొంత నిండని ఏడ్పు ఎంతసేపని ఏడ్వను ? 
సొంతమనుకోను కొంత మిగుల్చుకున్నాను 

మరణమందని తరుణాన కనుపాపను ముద్దాడె వరుణదేవుడు 
కరుణ చూపని నీ ప్రేమ కిరణాలకు చిన్నబోతిడి అరుణదేవుడు

దారమై పోతాను

దారమై పోతాను నీ నవ్వుల పూలమాలకు 
దాసుడై పోతాను నీ తేనెల పలుకులకు 
వెన్నెలలు కురిపించు  కన్నులను చూస్తే 
కన్నేలెందరికి కన్నుకుట్టునో కదా ! 
సిగ్గులొలికే నీ బుగ్గ ఎరుపు చూస్తే 
పూల మనసు భగ్గుమనదా! 
తేనెలొలికే నీ పలుకు వింటే వీణతంత్రి మూగదవద ! 
కంటి ముందు ఇంతటి అందమే ఎదురైతే నా కనురెప్ప మూత పడుతుందా!

ఎన్నెల కాసే ఏల

ఎన్నెల కాసే ఏల కన్నులు కలిసేనే పిల్లా 
ముసురులు కమ్మే ఏల మనసులు కలిసేనే పిల్లా 

బక్కపలచ నడుముతోటి పిక్కల పైదాకా 
సుక్కల సీర సుట్టి సక్కగ పోతుంటే 
నువ్వు నా పక్కగ పోతుంటే 
నాకు సుక్కేసినట్టుందే పిల్లా 
యెదలో పక్కేసుకున్తానే పిల్లా

మనసుకే తెలుసు మనసు వేదం

మనసుకే తెలుసు మనసు వేదం 
కనులలో దాగు హృదయ నాదం 
ప్రేమకై వ్రాయు మధుర గ్రంధం 
ఇది దేవుడే ఆడు జతల జూదం 
ఒక మధుర గానమే పెదవి దాటెనే విరహ బాధలోనే 


ఒక పాట నే పాడినా 
 పాట నిను చేరినా 
 రాగమై వినిపించెనో 
ఒక మౌనమై మరుగయ్యెనొ 
జాడైన చెప్పవు మనసంత కరుకుతనమా 
తిరిగైన చూడవు నేనంటే అలుసుతనమా 


పూలెన్నో నే కూర్చినా 
నినుచేర నీకంపినా 
నీ అడుగుకై అవి వెతికెనో 
నీ అడుగులో అవి చితికెనో 
బదులైన చెప్పవు నను చూస్తె నీకు పరిహాసమా 
నా చెంత చేరవు కన్నీటితో నాకు సావాసమా