Monday, November 28, 2011

విశ్వశాంతి యుద్ధం

తరతరాల చరితం
ఇది రగులుతున్న భరతం
తీవ్రవాద కోరల్లో సామ్యవాదం 
ఉగ్రవాద ఉక్కుపాదం కింద లౌకికవాదం
మదోన్మాద మతమౌడ్యం
కుతంత్రాల కులజాడ్యం 
ఈ రెంటిదే ఈనాటి ఈ రాజ్యం 
మువ్వన్నెల పూరేకుపై ముష్కరుల నీలి చారలు 
ప్రపంచాబ్జపు తెల్లరేకుపై అమాయకుల రుధిర ధారలు
విశ్వశాంతి యుద్దానికి  ఏ గాంధీ నాంది పలికేనో?
ఏ నెహ్రు దానికి గొంతు కలిపేనో ? 

Sunday, November 27, 2011

నా ప్రాణాలు



వెదురంటి నా మనసును వేణువే చేసింది

కుదురైన నిదురలో కలలెన్నో రేపింది

భ్రమరాలే భ్రమిసే పువ్వంటి అందం

చెలి చెక్కిలిపై పూసే సింధూర గంధం

చిరునవ్వులోనే సిరులెన్నో వొలికించె

సిరిమువ్వ తానే తన పాదాన తలవంచె

తన సాటి అందం ఈ జగాన లేదు

నా ప్రాణాలు ఐదు చేసాను తన కలల ముంగిట ఖైదు

Friday, November 5, 2010

కన్నీటి రేఖలు

కసురుకునే నీ వైనం ఉసురు తీస్తున్నా
విసుగు రాని నా మనసే ఎదురుచూస్తోంది
ముసురుకునే నా మరణం నను మసి చేస్తున్నా
తీరిపోని నా ఆశే మరుజన్మనిస్తోంది
నవ్వు నటిస్తున్నా నమ్మలేమంటున్నారు
కంటిలో నలకని సర్ది చెప్పినా వంకలు చెప్తున్నానంటున్నారు
బహుశా సంద్రాన్ని తలపించే కన్నీటిని ఇముడ్చుకునేందుకు నా దేహవైశాల్యం సరిపోలేదేమో
నిద్రిస్తున్నా కాని చెక్కిలిపై కన్నీటి రేఖలు ముద్రిస్తూనే ఉంది ఈ ప్రేమ

Sunday, October 24, 2010

యద భారమైనా సరే

దహించు ఈ వేదనే సహించలేకున్నా
తప్పని ఈ నిజాన్ని తప్పించుకోలేకున్నా
నువు రావని తెలిశాక ఆమని ఇక దరిచేరేనా
నువు లేవని తెలిశాక నాకని ఇక నేనుంటానా
కలలెన్నో కలవని కలవరించే కనులకు కన్నీరే మిగిలింది
నిజమేదో తలవని తపించే తలపులకు గతమే మిగిలింది
నువు దూరమయ్యవని నా ప్రేమ నన్ను దూరమవ్వదు
యద భారమైనా సరే కథ ముందుకు నడిపిస్తాను

Wednesday, October 6, 2010

నీ కోసమే కలం పట్టాను

నీ కోసమే కలం పట్టాను 
నీ కోసమే కలలు కన్నాను

కాదని కాలదన్నితే 
కాటికి సాగనంపితే
జీవచ్చవమై బ్రతుకుతున్నాను 
యదను పరచి స్వాగతిస్తే ....
నీవు వ్యధను పెంచి ఉసురు తీస్తే 
శ్వాస బరువై భరిస్తున్నాను 
మాటకు బదులు రాదు
పాటకు కదిలి రావు
తూట్లు పడిన నా గుండెకు ఇక కదలికే రాదు 
కన్నీటి కలలకెదురుగా ఎన్నాళ్ళీ ఎదురీత 
పదునెక్కిన మౌన శిలల మధ్య ఎన్నాళ్ళీ యదకోత 

నేను కవిని కావాలని

నేను కవిని కావాలని 
నా మనసు ఉరకలు వేస్తోంది 

అందుకే నిద్రిస్తున్న నా చెలియను 
అనిమేషంగా పరిశీలిస్తూ ఎదురుగా కూర్చున్నాను 

అప్పుడే వరప్రసాదంలా కలువరేకుల్లా 
తన కళ్ళు విచ్చుకుంటుంటే నాలోని కవితా భావం 
చంద్ర కిరణంలా వెల్లివిరిసింది 

ఆమె ఉచ్చ్వాస , నిశ్వాసల శబ్ద ,నిశ్సబ్డ్హాలు 
నా హృదయ కవాటాల్లా ఝుమ్మంటున్నాయి

ధైర్యం తోడుగా నిలిచింది 
ప్రేమ ప్రేరణగా  నడిపింది 

తియ్యని కవితా ప్రవాహంలా నా కవి హృదయాన్ని వెలికి తీశాను 
వెంటనే నా కలం తన కలల వెంట పరుగులు తీసింది 
ఆ వెంటనే వెండి వెన్నెల కుంచెతో సంధ్యారాగాలు 
చిత్రించినట్లు ఆమె చిరునవ్వు విరిసింది 

అ నవ్వుల వెన్నెల్లో తడిసి ముత్యాల్లా 
మెరుస్తున్నాయి నా కవితాక్షరాలు 

తన అందియల చిరు చిరు సవ్వడులు 
నా కవితా గానానికి తాళం అయ్యాయి 

ఐతే ఏం లాభం నా గీతం తన చెవిని 
చేరేలోగా నా గానం మూగవోయింది

నగవు

మగువల నగవులకే నీవు నగవు
కవుల కలములకే నీవు కలవు
నినుగన్న సెలయేటి ఉరుకులకిక సెలవు
నీ సిగ చేరి పులకించె సిరిమల్లె తనువు
నా కన్నుల కదలాడు కన్నెవు
హరివిల్లు చూపలేని విరిజల్లు వన్నెవు
సిరివెన్నెల కాయించు కలువవు
కనుగలువల పూయించు కొలనువు